పడక గదిలోకి అడుగు పెట్టగానే ఎటువంటి వాతావరణం ఉండాలో గత వారం చూశారుగా! పడక గది అలకరణ ఎలా ఉండాలో ఇక ఇప్పుడు చూద్దాం.
పడక గదిలో ఇంతకు ముందు వివరించిన శయ్య ఒకటి ఉండాలి. అంతకంటే తక్కువ ఎత్తులో మరొక శయ్య కూడా అందుబాటులో ఉంచుకోవాలి. శృంగార కార్యకలాపాలకు వినియోగించిన శయ్యను నిద్రించడానికి వాడరాదు. రతి అనంతరం విశ్రమించడానికి, ఒక పడక కుర్చీ వంటిది వాడుకోవాలని, నిద్రించడానికి ఈ చిన్న మంచాన్ని వాడుకోవాలని వాత్స్యాయనుడు చెబుతాడు. మంచానికి అందుబాటులో సుగంధ ద్రవ్యాలు ఉంచుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక అరుగుగాని, అర గాని ఏర్పాటు చేసుకోవాలి.
పడక గదిలో ఒక శృంగార గ్రంథాన్ని, శృంగార రసాత్మకమైన చిత్రపటాలను అమర్చుకోవాలి.
స్త్రీ పురుషుల వినోదం కోసం చదరంగం, జూదం వంటి క్రీడలకు ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఏదేమైనా శృంగార క్రియకు ఉద్దీపనం వలె పనిచేయడానికే ఈ సూత్రాలన్నీ.
పడక గది చెంతనే సువాసనలిచ్చే వృక్షాలున్న ఉద్యానవనం ఉండాలి. పడక గది, ఈ ఉద్యానవనం పరిశుభ్రంగా ఉంటూ నిత్యం సువాసనలు వెదజల్లుతుండాలి మనసైనప్పుడు సంగీత రసాస్వాదన చేయడానికి వీణ, వేణువు వంటి వాయిద్యాలు అందుబాటులో ఉండాలి.
పడక గది అలంకరణ గురించి వాత్స్యాయన ముని ఇచ్చిన సూచనలను సంక్షిప్తంగా వివరించాం. పడక గది అలంకరణ గురించి తెలుసుకున్నారుగా! రసవంతమైన శృంగార జీవనానికి పురుషుడు పాటించవలసిన నియమాలను, దైనందిన జీవితం గురించి కూడా వాత్స్యాయనుడు వివరించాడు. ఆ నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం.
తెల్లవారక ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి సుగంధ భరితమైన ధూపం వేసుకుని, తాంబూలం సేవించి అప్పుడు మిగిలిన దైనందిన జీవితం ఆరంభించాలి. పురుషుడు ప్రతి రోజూ రెండు పూటలా స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. క్షుర కర్మ కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి. రాత్రి పూట వేడి నీటితోనే స్నానం చేయాలి. పగటినిద్ర పనికిరాదు. అపరాహ్ణ వేళకుముందే పగటిపూట భోజనం పూర్తి చేయాలి. చీకటి పడిన సుమారు రెండు జాముల ప్రాంతంలో రాత్రి భోజనం చేయాలి. పగటి భోజనం కంటే రాత్రి పూట భోజనమే శరీరానికి శక్తినిస్తుందని వాత్స్యాయనుడు చెబుతాడు.
పడక గదికి కాని, సంకేత స్థలానికి కాని స్త్రీ కంటే ముందుగా పురుషుడే చేరుకుని ఆమె కోసం నిరీక్షించాలని, తనను చేరిన ప్రియురాలిని అలరించి, ఏదైనా కారణం వల్ల అలక మీదుంటే ఆ అలుక తీర్చి ఆమెను శృంగార క్రీడకు సమాయత్తం చేయాలి.
{ 0 nhận xét... read them below or add one }
Đăng nhận xét